March 18, 2013
బాబు యాత్ర రూట్ ఖరారు

అక్కడి పాయకరావుపేట, నర్సీపట్నం, ఎలమంచిలి, అనకాపల్లి, పెందుర్తి నియోజకవర్గాల మీదుగా విశాఖ నగరంలోనికి పాదయాత్ర సాగుతుంది. నగరంలోని నాలుగు నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసిన అనంతరం భీమిలిలోకి ప్రవేశిస్తారు. ఇక్కడి నుంచి విజయనగరం జిల్లాకు వెళతారని ప్రాథమిక సమాచారం.
జిల్లాలో చంద్రబాబు పాదయాత్రపై ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశానికి రూరల్, అర్బన్ కమిటీల అధ్యక్షులు దాడి రత్నాకర్, వాసుపల్లి గణేష్‌కుమార్, పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు, నాయకులు పప్పల చలపతిరావు, ఆర్ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు, గుడివాడ నాగమణి, కోన తాతారావు, పీలా శ్రీనివాసరావు, లాలం భాస్కరరావు, ఆడారి ఆనంద్, దేవరపుశివ, వినోద్‌రావు, బొలిశెట్టి శ్రీనివాసరావు, పాశర్ల ప్రసాద్, పుచ్చా విజయ్‌కుమార్, పోతన్నరెడ్డి, ఆవుగడ్డ అప్పలనాయుడు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు సంబంధించి తాత్కాలిక రూట్‌మ్యాప్‌ను ఖరారుచేశారు. దీనిపై నియోజకవర్గాల వారీగా నాయకులతో మంగళవారం నుంచి సమావేశమై మరింత విపులంగా చర్చించనున్నారు.
తూర్పుగోదావరి జిల్లా నుంచి విశాఖ జిల్లాలోకి ప్రవేశించే ప్రాంతం పాయకరావుపేట కాకుండా నాతవరం మండలానికి మార్చాలని కొంతమంది నాయకులు కోరుతున్నారు. తుని నుంచి కాకుండా కోటనందూరు నుంచి చంద్రబాబు జిల్లాలోకి అడుగిడేలా రూట్ మార్చితే పాయకరావుపేట, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎక్కువ గ్రామాలు కవర్ అవుతాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ విధంగా మార్చితే చంద్రబాబు విశాఖ జిల్లాలోకి ప్రవేశం మరో ఒక రోజు ఆలస్యమయ్యే అవకాశం వుందని భావిస్తున్నారు.
జిల్లాలో అనకాపల్లి నుంచి సబ్బవరం మీదుగా పెందుర్తి వచ్చి నగరంలోకి ప్రవేశించేలా మరో ప్రతిపాదన చేశారు. ఇది కాకుండా అనకాపల్లి నుంచి పరవాడ, ఉక్కు నగరం, గాజువాక మీదుగా మరో రూట్ పరిశీలనలో వుంది. నగరం నుంచి భీమిలి నియోజకవర్గంలోకి వెళ్లాలంటే హనుమంతువాక నుంచి బీచ్‌రోడ్‌లోకి వెళ్లాలా? లేక ఆరిలోవ మీదుగా నీళ్ల కుండీల వైపు వెళ్లాలా? అన్నది పెండింగ్‌లో పెట్టారు. పెందుర్తిలో పాదయాత్రపై ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తితో చర్చించిన తరువాత నిర్ణయిస్తారు.
ప్రస్తుతం రూపొందించిన తాత్కాలిక షెడ్యూల్‌ను పార్టీ అధినేత చంద్రబాబుకు, పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. సాధారణంగా రూట్ వివరాలను చంద్రబాబే స్వయంగా పరిశీలించి అవసరమైన చోట మార్పులు చేస్తున్నారు. అందువల్ల ఆదివారం సమన్వయ కమిటీ సమావేశంలో రూపొందించిన రూట్ మ్యాప్‌లో మార్పులు చేర్పులు వుంటాయని రూరల్ అధ్యక్షుడు దాడి రత్నాకర్ తెలిపారు.
Posted by
arjun
at
6:08 AM