February 23, 2013
అరాచక పాలన

దోనెపూడిలో లక్ష్ష్మీతిరుపతమ్మ దేవస్థానంలో పురోహితుల దీవెనలు అందుకొన్న చంద్రబాబు పాదయాత్రను పునఃప్రారంభించి ముందుకు కదిలారు. భట్టిప్రోలు శివారు వరకు దారి పొడవునా ప్రజలు ఆయన రాక కోసం ఎదురు చూశారు. అడుగడుగునా మహిళలు హారుతులిచ్చి స్వాగతం పలికారు. వెల్లటూరులో చంద్రబాబుకు భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కనకతప్పెట్లు, మేళతాళాలతో సందడి చేశారు. ప్రజలకు అభివాదం చేస్తూ మహిళలతో సంభాషిస్తూ వారి సమస్యలు తెలుసుకొంటూ చంద్రబాబు ముందుకు సాగారు. కష్టాలు ఏకరువు పెట్టిన మహిళలకు తానున్నానని భరోసా ఇచ్చారు.
ఉద్రేకానికి లోనైన చంద్రబాబు హైదరాబాద్‌లోని దిల్‌షుక్‌నగర్ బాంబుపేలుళ్ల ప్రాంతాన్ని సందర్శించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతోన్న క్షతగాత్రులు పడుతోన్న బాధలు చూసిన చంద్రబాబు ఒకింత ఉద్వేగం, ఉద్రేకానికి లోనయ్యారు. మృతుల బంధువుల ఆర్తనాదాలు చూసి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. రజిత అనే ఎంబీఏ విద్యార్థి ఇంటికెళుతుంటే బాంబుపేలి కాలును కోల్పోయి జీవితాంతం వికలాంగురాలు అయ్యే పరిస్థితి ఏర్పడింది. మరో బీటెక్ విద్యార్థి కాలు పూర్తిగా నుజ్జు అయింది. తీవ్రంగా గాయపడిన వారు బతికే పరిస్థితి లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదుల దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు. పేలుళ్ల సంఘటన దారుణమని, అందరూ ఉండే రాజధాని నగరంలో రద్దీగా ఉండే సెంటర్‌లో అతి దారుణంగా పేల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై పట్టులేకపోయినా, పరిపాలన అనుభవం లేని వ్యక్తి సీఎంగా ఉన్నా ఇలాంటివే జరుగుతాయని పరోక్షంగా ముఖ్యమంత్రి కిరణ్‌పై మండిపడ్డారు.
కాంగ్రెస్ తొమ్మిదేళ్ల పాలనను చంద్రబాబు తూర్పారబట్టారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ ఆనందంగా లేరు. ప్రజాపాలన అంటే ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించి వారి ఆదాయం పెంచాలి. అలాంటిది ఈ ప్రభుత్వం ప్రజలు జీవించే పరిస్థితి లేకుండా చేస్తోందని మండిపడ్డారు. ఒకవైపు అన్నిరకాల సరుకుల ధరలు ఆకాశాన్నంటిస్తూ మరోవైపు ప్రజలకు రక్షణ కూడా లేకుండా చేస్తోందని దుయ్యబట్టారు. ట్యూబులైట్ మాడిపోయి ఎలాగైతే మిణుకుమిణుకుమంటోందో అలానే ఈ ప్రభుత్వం కొనసాగుతోందని విమర్శించారు. దోనెపూడిలో పలువురు మహిళలు చంద్రబాబుతో సంభాషించారు.
డ్వాక్రా మహిళ: సార్ పావలావడ్డీ, వడ్డీలేని రుణాలు అని చెప్పడమే తప్పా మేము బ్యాంకు నుంచి రుణం తీసుకొంటే ప్రతి నెలా రూ. లక్షకు వెయ్యి చెల్లించాల్సి వస్తోంది. అంత మొత్తం మేమెలా సంపాదించాలి. ఇప్పటివరకు మేము చెల్లించిన వడ్డీని తిరిగి ఇచ్చిన దాఖలాలు లేవు. చంద్రబాబు: మీరు నన్ను మరిచిపోయి కష్టాలు కొని తెచ్చుకొన్నారు. డ్వాక్రా సంఘాలను నేనే స్థాపించాను. మళ్లీ అధికారంలోకి వస్తే మీరు చెల్లించిన వడ్డీ మొత్తం తిరిగి మీ బ్యాంకు ఖాతాల్లో వేస్తాను.గృహిణి: చంద్రబాబుగారు... బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, కూరగాయల ధరలన్నీ కొండెక్కి కూర్చున్నాయి. మేమెలా బతకాలి. మళ్లీ మీరొస్తేనే మా కష్టాలు తీరతాయని మేము ఆశిస్తున్నాం.
చంద్రబాబు: నేను ఆ రోజున రైతుబజార్లు పెట్టి నిత్యవసర సరుకుల ధరలను నియంత్రించాను. ఈ రోజున బియ్యం రూ. 50, నూనె రూ. 100, పప్పు రూ. 80 అయ్యాయి. వాటిని అదుపులోకి తీసుకొచ్చే బాధ్యత తీసుకొంటాను.వలస కూలీ: సార్ మేము దోనెపూడికి వచ్చి 16 ఏళ్లు అవుతుంది. బతుకుదెరువు కోసం వచ్చి ఇక్కడే స్థిరపడ్డాము. మాకు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు, ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు ఉన్నాయి. అయినా మాకు ఇంటి స్థలం ఇవ్వడం లేదు.చంద్రబాబు: మీకు ఇంటి జాగానే కాదు. రూ. లక్షన్నర పెట్టి స్వంత ఇల్లు కూడా కట్టించి ఉచితంగా ఇచ్చే బాధ్యత నాది.
రైతు: వ్యవసాయం చేయలేకపోతున్నాం. ఎరువులు, పురుగుమందుల ధరలు 300 రెట్లు పెరిగిపోయాయి. ప్రభుత్వం పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు. కరువు, విపత్తులు వస్తే ఆదుకోవడం లేదు. కనీసం మీరైనా అధికారంలోకి వచ్చి మా గురించి పట్టించుకోండి.చంద్రబాబు: వ్యవసాయం లాభసాటిగా చేసే బాధ్యత నేను తీసుకొంటాను. రైతుకు మద్దతు ధర కాదు గిట్టుబాటు ధర వచ్చేలా చేస్తాను. విపత్తులు వస్తే రూ. 10 వేల నష్టపరిహారం లేదంటే బీమా మీ చేతికందేలా చేసి వ్యవసాయంపై భరోసా కల్పిస్తాను.
ఒక తడి సాగునీరు ఇప్పించే వరకు పోరాటండెల్టాలో మొక్కజొన్న, పెసర వంటి ఆరుతడి పంటలు వేశారు. కనీసం రెండు తడులు ఇస్తే రైతులు గట్టెక్కుతారు. ఈ ప్రభుత్వం అది కూడా చేయడం లేదు. రైతుల తరపున మహాధర్నాకు దిగి పోరాటం చేయాలని అనుకొన్నాను. అయితే అకాలవర్షం వచ్చి పంట తడిసేలా చేసింది.
మరో తడి ఇప్పించేందుకు తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం మీకు అండగా నిలబడుతుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాదయాత్రలో చంద్రబాబు వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, కొమ్మాలపాటి శ్రీధర్, జీ వీ ఆంజనేయులు, టీడీపీ జిల్లా నాయకులు మన్నవ సుబ్బారావు, వేములపల్లి శ్రీరాంప్రసాద్, మానుకొండ శివప్రసాద్, పానకాల వెంకటమహాలక్ష్మి, కొర్రపాటి నాగేశ్వరరావు, చంద్రగిరి ఏడుకొండలు తదితరులు నడిచారు.
Posted by
arjun
at
5:53 AM