January 18, 2013
విజయమ్మ వాకిట్లో అవినీతి చెట్టు
అదే పెరిగి జగన్ ప్యాలెస్ అయింది
సంతకాలు చేస్తే అవినీతి కాస్తా నీతవుతుందా?
వైఎస్ హయాం అధికారులంతా జైల్లోనే..
నల్లగొండ పాదయాత్రలో చంద్రబాబు నిప్పులు
అవినీతిపై పోరాటం చేయడం ద్వారానే మహానేత ఎన్టీఆర్‌కు నిజమైన నివాళి అర్పించగలమని పేర్కొన్నారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కోదాడ మండలంలో ఏర్పాటుచేసిన విగ్రహాలను ఆవిష్కరిస్తూ శుక్రవారం చంద్రబాబు పాదయాత్ర కొనసాగింది. కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్, కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల, హరిజనవాడ, మార్కెట్ ఆఫీస్, బాలాజీనగర్ ప్రాంతాల మీదుగా 15 కిలోమీటర్లు నడిచారు.
కోదాడ పట్టణంలోకి ప్రవేశిస్తుండగా వేదపండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎమ్మెల్యే చందర్‌రావు ఇంటివద్ద వంద మంది మహిళలు మంగళహారతులు పట్టారు. చెప్పులు కుట్టే పల్లె వెంకటేశ్వర్లు.. ప్రత్యేకంగా తయారుచేసిన చెప్పులను బహూకరించారు. దానికిముందు ఉదయం బస్సు నుంచి దిగగానే కిట్స్ కళాశాల ప్రాంగణంలో ఎన్టీఆర్‌కు నివాళి అర్పించి ప్రసంగించారు.
జాతీయంగానూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ ఏకపక్ష పాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, చూడలేక తెలుగుదేశం పార్టీని స్థాపించి దేశ రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని నివాళి అర్పించారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా రైతులకు అండగా ఉంటానని, అవసరమైతే ఎరువుల ధరలు తగ్గిస్తానని, పత్తి క్వింటాల్ మద్దతు ధర ఐదు వేల రూపాయల నుంచి ఆరువేల వరకు పెంచుతానని ప్రకటించారు.
సంతకాలు పెట్టగానే జగన్ అవినీతి నీతిగా మారుతుందా? అని ప్రశ్నించారు. 'ఆయన దగ్గర పనిచేసిన శాఖ అధిపతులు, పెట్టుబడి పెట్టిన వ్యాపారులు జైలుకు వెళ్లారు. అప్పుడు దోపిడీ చేసిన మంత్రులు ఇప్పుడు దొరల్లా తిరుగుతున్నారు'' అని వైఎస్ పాలననుద్దేశించి చంద్రబాబు విరుచుకుపడ్డారు. కాగా, కిట్స్ కళాశాలకు వెళ్లిన చంద్రబాబుకు విద్యార్థులు వేలాదిగా స్వాగతం పలికారు. కాబోయే ముఖ్యమంత్రి అంటూ వారంతా పెద్దఎత్తున నినాదాలు చేశారు.
Posted by
arjun
at
7:50 PM