January 18, 2013
మంత్రులారా..! ఖబడ్దార్!!
14.8 కి.మీ. పాదయాత్రలోవివిధ వర్గాలను కలుసుకుని మాట్లాడారు. 'నాగార్జునసాగర్‌లో ఉండే ఒక మంత్రి మా నాయకుడు చిన్నపరెడ్డి జోలికి వచ్చి తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. ఎస్ఎంఎస్ పెట్టారని జైలుకు పంపారు. నేను వారిలాగే అనుకుని ఉంటే ఈ మంత్రులు ఏమయ్యేవారు? ఎక్కడుండేవారు?? ప్రజాస్వామ్య పద్ధతిలో రండి. ధైర్యంగా ఎదుర్కొంటాం' అని అన్నారు. 'మీ ప్రాణాలకు నా ప్రాణాలు అడ్డం వేస్తా' అని కార్యకర్తలకు «భరోసా ఇచ్చారు. 'నాగార్జునసాగర్‌లో డెడ్ స్టోరేజీ ఉన్నా ఎమ్మెల్యేలు, పోలీసులను కాల్వలపైపెట్టి నీళ్లు ఇప్పించా. కిరికిరి సీఎంకు అవగాహన లేదు. గోదావరి, కృష్ణా ఎక్కడ పారుతుందో తెలియదు' అని కిరణ్‌కుమార్‌రెడ్డిని ఎద్దేవా చేశారు.
డ్వాక్రా సంఘాలకు పొదుపు ఉద్యమం నేర్పించానని, కట్టెల పొయ్యితో వంట చేయడం కష్టమని ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇప్పించాననని టీడీపీ అధినేత చెప్పారు. తాను సీఎంగా ఉన్న తొమ్మిది సంవత్సరాల కాలంలో ఒక్కసారి కూడా గ్యాస్ ధర పెంచలేదని గుర్తు చేశారు. 'నా హయాంలో కిలోచక్కెర రూ.12 ఉంటే ఇప్పుడది రూ.48కి చేరింది. పప్పు ధర రూ.22 నుంచి రూ.80కి పెరిగింది. చింతపండు కిలో రూ.20 నుంచి రూ.90కి ఎగబాకింది.
ఇలా పెరిగితే ఏం తింటారు' అని ప్రశ్నించారు. దుస్తులు, ఇళ్లు, మంచినీళ్లపై..ఇలా అన్నిటిపైనా పన్నులు పెరిగాయి. దోభీఘాట్లపై సర్వీస్ చార్జ్ విధించి రజకుల నడ్డి విరిచారు' అని ఆగ్రహం వ్యక్తంజేశారు. పన్నులు పెంచి, కుంభ కోణాల రూపంలో సొంత ఆస్తులు పెంచుకోవడమే తప్ప కాంగ్రెస్ నేతలు ఏమైనా మేలు చేశారా తమ్ముళ్లూ...! అని చంద్రబాబు ప్రశ్నించారు.
తొమ్మిది సంవత్సరాలుగా రాష్ట్రంలో దొంగలు పడ్డారని, ఇందిరమ్మ ఇళ్లపేరుతో కాంగ్రెస్ నేతలు ఐదారు గృహాల బిల్లులు స్వాహా చేస్తున్నారని ఆరోపించారు. ఉపాధి కూలీ డబ్బులు సైతం వదలడం లేదని, ఆదర్శ రైతులుగా కాంగ్రెస్ కార్యకర్తలను పెట్టించారని, అంత్యోదయ, ఐఏవై వంటి పేదల పథకాలను ఈ చిన్న చిన్న పందికొక్కులు మింగేస్తున్నాయన్నారు. తొమ్మిది గంటలు కరెంటు ఇస్తామని అధికారంలోకి వచ్చే ముందు, ఏడు గంటలు ఇస్తామని అధికారంలోకి వచ్చాక చెప్పారని, ఇప్పుడు మూడు గంటలకు మించి ఇచ్చే పరిస్థితి లేదన్నారు.
తన హయాంలో గడియారం చూసుకుంటే కరెంటు వచ్చేదని, విద్యుత్ వ్యవస్థకు పూర్వ వైభవం రావాలంటే తెలుగుదేశంపార్టీ అధికారంలోకి రావాల్సిందేనన్నారు. రాష్ట్రంలో వస్తున్న లక్షన్నర కోట్ల రూపాయల ఆదాయం కాంగ్రెస్ దొంగల జేబుల్లోకి పోయిందని విమర్శించారు. జిల్లాలో నాలుగు వరుసల రహదారులు, సీసీ రోడ్లు, ఇలా ఏ అభివృద్ధి జరిగినా అది టీడీపీ కాలంలోనే అని తెలిపారు. ఈ ప్రభుత్వ సిద్ధాంతం చూస్తే 'మందు ఫుల్లు.. మంచినీళ్లు నిల్లు' తీరుగా ఉందన్నారు. 'సెల్ ఫోన్‌లో ఎస్ఎంఎస్ కొడితే మందు నడుచుకుంటూ వస్తుంది.
మంచి నీళ్లు మాత్రం ఫోన్ చేసినా రావడం లేదు' అని దుయ్యబట్టారు. పాదయాత్రలో ఎమ్మెల్యేలు ఉమామాధవరెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, చందర్‌రావు, జిల్లా అధ్యక్షుడు బీల్యానాయక్, తేరా చిన్నపరెడ్డి, గుండ్లపల్లి సురేష్, పాల్వాయి రజనీకుమారి, చిలువేరు కాశీనాథ్, నెల్లూరి దుర్గాప్రసాద్, బోయపల్లి కృష్ణారెడ్డి, జక్కలి అయిలయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Posted by
arjun
at
7:56 PM