December 26, 2012
తెలంగాణపై కేంద్రానకి మరోసారి టీడీపీ లేఖ

అడుగు వెనక్కి తీసుకోలేమ2008లో చేసిన తీర్మానం పునరుద్ఘాటన!
సీమంధ్ర నేతలతో బాబు
200 సీట్లలో ప్రజల మనోభావాలను
గుర్తించాలని కోరిన నేతలు
తెలంగాణ అంశంపై కేంద్రానికి మరోసారి
లేఖ రాయాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన ఢిల్లీలో జరిగే అఖిలపక్ష
సమావేశంలో ఆ పార్టీ ఈ లేఖను కేంద్ర హోం మంత్రికి అందచేయనుంది. ఈ లేఖలోని సారాంశం నిర్దిష్టంగా
ఖరారు కాకపోయినా తెలంగాణ పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ ఈ లేఖ ఉంటుందన్నది ఆ పార్టీ
వర్గాల సమాచారం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు తెలుపుతూ టీడీపీ 2008లో తీర్మానం
చేసింది. దాని ప్రతిని ప్రణబ్ ముఖర్జీ కమిటీకి అందచేసింది. అదే విషయాన్ని పేర్కొంటూ
తాజా లేఖను ఇవ్వనున్నారు.
'2008లో టీడీపీ చేసిన తీర్మానం తెలంగాణ ఏర్పాటు పట్ల చాలా స్పష్టమైన తీర్మానం.
దాని గురించి తాజా లేఖలో పేర్కొనడమంటే తెలంగాణకు గట్టి మద్దతు ఇచ్చినట్లే. రెండు ప్రాంతాల్లో
ఉన్న పార్టీ ఇలాంటి వైఖరితో అఖిలపక్షానికి వెళ్లడం పెద్ద సాహసం. గత కొంతకాలంగా తెలంగాణ
పట్ల సానుకూలతతో మాట్లాడుతున్న చంద్రబాబు అదే వైఖరితో ఈ నిర్ణయం తీసుకొన్నారు' అని
ఆ పార్టీ ముఖ్యుడు ఒకరు వివరించారు. తాను పాదయాత్ర చేస్తున్న కరీంనగర్ జిల్లాలో బుధవారం
ఉదయం సీమాంధ్ర నేతలతో సమావేశమైన చంద్రబాబు ఈ మేరకు తన మనోగతంపై వారికి సంకేతాలు ఇచ్చారు.
'తెలంగాణ విషయంలో ఒక అడుగు ముందుకు వేసేశాం.
అఖిలపక్షం పెడితే మన వైఖరి చెబుతామని అన్నాం. ఇప్పుడు వెనక్కు వెళ్లలేం.
అర్ధం చేసుకోండి' అని ఆయన వారితో అన్నారు. కానీ పయ్యావుల కేశవ్, కాల్వ శ్రీనివాసులు,
సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, ధూళిపాళ నరేంద్ర, దేవినేని ఉమా మహేశ్వరరావు తదితర నేతలు
తమ వైపు వాదనను ఆయనకు గట్టిగా వినిపించారు. 'తెలంగాణ వాదం 60- 70 నియోజకవర్గాల్లో
గట్టిగా ఉంది. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో అది అంశం కాదు. 200 నియోజకవర్గాల్లో
ప్రజల మనోభావాలు వేరుగా ఉన్నాయి.
మనం తెలంగాణకు అనుకూలంగా మాట్లాడితే దానిని అవకాశంగా తీసుకొని ఈ సీట్లలో
మనను దెబ్బ కొట్టాలని వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు కాచుకొని కూర్చున్నాయి. అవి తమ వైఖరి
చెప్పకుండా దాక్కొని కేవలం మనను సీమాంధ్రలో దోషిగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయి'
అని వారు వాదించారు. సమైక్యవాదంతో వెళ్లాలని తాము పార్టీపై ఒత్తిడి తేవడం లేదని, తెలంగాణ
పట్ల సానుకూలంగా మాట్లాడుతూనే సీమాంధ్రలో కూడా పార్టీ నేతలు ఇతర పార్టీల దాడిని తట్టుకొనే
విధంగా పార్టీ వైఖరిని రూపొందించాలని వారు ఆయనకు సూచించారు. అఖిలపక్ష సమావేశానికి
రెండు ప్రాంతాల నుంచి ఇద్దరు ప్రతినిధులను పంపాలని, అవకాశం ఉంటే సీమాంధ్రలో వెనకబాటుతనం
గురించి, నదీ జలాల సమస్యల గురించి మాట్లాడటానికి అనుమతి ఇవ్వాలని వారు కోరారు.
ప్రతినిధులపై తర్జనభర్జన
అఖిలపక్షానికి టీడీపీ తరపున రెండు ప్రాంతాల నుంచి ఇద్దరు ప్రతినిధులు హాజరు
కావడం ఖరారైంది. పోయినసారి అఖిలపక్షానికి వెళ్ళిన యనమల రామకృష్ణుడు, రేవూరి ప్రకాశ్‌రెడ్డిలనే
ఈసారి కూడా పంపుతారా లేక మార్పు ఉంటుందా అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. తెలంగాణ
నుంచి ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారిని పంపాలనుకుంటే మోత్కుపల్లి నర్సింహులు లేదా
రమేష్ రా«థోడ్‌ల్లో ఒకరికి అవకాశం లభించవచ్చు. సీమాంధ్ర
నుంచి కూడా మార్చాలని అనుకొంటే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి పేరు పరిశీలనకు రావచ్చునని
అంటున్నారు.
అఖిలపక్షంలో ఒకే అభిప్రాయం: యనమల
కరీంనగర్: తెలంగాణపై 28న జరిగే అఖిల పక్ష సమావేశంలో తెలుగుదేశం ఒకే నిర్ణయం
చెబుతుందని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. పార్టీ
నుంచి ఒక్కరు వెళ్లినా, ఇద్దరు వెళ్లినా ఒకే నిర్ణయం ఉంటుందని చెప్పారు. గురువారం అన్ని
ప్రాంతాల పొలిట్‌బ్యూరో సభ్యులతో చంద్రబాబు సమావేశమవుతారని, అప్పుడే ఏం చెప్పాలన్న
దానిపై తుది నిర్ణయం తీసుకుంటామని యనమల స్పష్టం చేశారు.
Posted by
arjun
at
9:03 PM