December 13, 2012
జైలు నుంచే జగన్ రాజకీయాలు: చంద్రబాబు
కాంగ్రెస్సే చెప్పాలి
తెలంగాణపై అక్కడిక్కడే మేమూ తేల్చేస్తాం
సాగుకు పగటిపూటే 9 గంటలు కరెంటు
టీఆర్ఎస్‌తో పొత్తు లేకుంటే గెలిచేవాళ్లం!
పాదయాత్రలో చంద్రబాబు

అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ ముందుగా తన వైఖరిని వెల్లడించాలనీ, ఆ వెంటనే, అక్కడికక్కడే టీడీపీ తన వైఖరి చెబుతుందని స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చెప్పకుండా... విపక్షమైన టీడీపీ వైఖరి చెప్పాలని డిమాండ్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. తెలంగాణకు టీడీపీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని పునరుద్ఘాటించారు. 'మాది ప్రజల మనోభావాలను గౌరవించే పార్టీ' అని బాబు తెలిపారు.
'వస్తున్నా మీకోసం' పాదయాత్రలో భాగంగా గురువారం ఆయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ నియోజకవర్గంలోని కొరటికల్, మామడ, పొన్కల్ క్రాస్, డాంబర్ ప్లాంట్, దిమ్మదుర్తి వరకు... 14.3 కిలోమీటర్ల దూరం నడిచారు. పలుచోట్ల ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. గతంలో భూమిలేని ఎస్సీలకు భూమి కొనుగోలు చేసి ఇచ్చామనీ, తాను ముఖ్యమంత్రి అయితే భూములు లేని బీసీలకు కూడా భూములు ఇస్తామని ప్రకటించారు. పొగాకు బోర్డు మాదిరిగానే పసుపు బోర్డు, పత్తి అభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
ఒక్కో కాంగ్రెస్ కార్యకర్త నాలుగైదు పేర్లమీద ఇళ్లను కట్టకుండానే... ఇందిరమ్మ బిల్లులు మింగేశారని ఆరోపించారు. అవినీతికి వైఎస్ నాంది పలికాడనీ, హైదరాబాద్‌లోని ఎనిమిది వేల ఎకరాల ప్రభుత్వ భూములను 53 మందికి అప్పగించి వేలాది కోట్లు అక్రమంగా దండుకున్నారన్నారు. జగన్ ప్రస్తుతం జైలుకెళ్లి అక్కడి నుంచే రాజకీయాలు నడిపిస్తున్నారని విమర్శించారు. "ఒకరిద్దరు ఎమ్మెల్యేలున్న పార్టీలు కూడా పత్రికలను, చానళ్లను పెడుతున్నాయి. తటస్థంగా ఉన్నవాళ్లు పత్రికలు, చానళ్లు పెడితే వాస్తవాలు తెలుస్తాయి'' అని బాబు అన్నారు.
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకోరని విమర్శించారు. 2009 ఎన్నికల్లో టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోకుంటే టీడీపీ అధికారంలోకి వచ్చేది. ప్రజలు కష్టాలు తీరేవన్నారు. కిరికిరి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ప్రజల సమస్యలు పట్టించుకోరని... ఇస్త్రీ నలగని దుస్తులతో ఫ్రెష్‌గా తిరుగుతుంటారని ఎద్దేవా చేశారు. ప్రజలంతా కష్టపడుతుంటే కాంగ్రెస్ నేతలు మాత్రం బొర్రలు పెంచుకొని తిరుగుతున్నారనీ విమర్శించారు.
Posted by
arjun
at
9:39 PM