August 30, 2013
తెలుగువారికి గుర్తింపు తెచ్చింది టీడీపీ

కాంగ్రెస్ కుట్రలను ప్రజలకు
వివరించేందుకే బస్సు యాత్ర :
ఏబీఎన్‌తో చంద్రబాబు
తెలుగువారికి గుర్తింపు తెచ్చిన పార్టీ
తెలుగుదేశం పార్టీ అని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి
చెప్పామని, ఆత్మ గౌరవంతో ప్రపంచాన్నే జయించవచ్చునని టీడీపీ అధ్యక్షుడు
చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో
ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టడం బాధాకరంగా ఉందని, విభజన
రాజకీయ ప్రయోజనాలకోసమేనని, జాతి ప్రయోజనాలకు కాదని పేర్కొన్నారు. 30 రోజుల
నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంటే కేంద్రం పట్టించుకోవడం
లేదని చంద్రబాబు విమర్శించారు.
అసలు విభజనకు బీజం వేసింది
వైఎస్సేనని, 1999లో ఎమ్మెల్యేలను ఢిల్లీకి పంపించారని, అప్పటి నుంచే ఈ
కార్యక్రమం మొదలైందని చంద్రబాబు పేర్కొన్నారు. విభజన ప్రకటన రోజే
టీఆర్ఎస్, వైసీపీలు తమతో వస్తాయని దిగ్విజయ్‌సింగ్ చెప్పారని అన్నారు.
రాష్ట్ర పరిస్థితులను ప్రధాన మంత్రి పట్టించుకోవడంలేదని బాబు విమర్శించారు.
వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలను అడ్డుపెట్టుకుని కాంగ్రెస్ రాజకీయ లబ్ది
పొందాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ అవినీతి డబ్బుతో పేపర్,
చానల్‌పెట్టి అదే పనిగా దుష్ప్రాచారం చేస్తే ప్రజలు నమ్మే స్థితిలో లేరని
అన్నారు.
తెలుగుదేశం పార్టీని దెబ్బ తీయాలనే కుట్రతో తెలుగు
జాతినే దెబ్బతీయాలనే పరిస్థితికి వచ్చారని, కాంగ్రెస్ స్క్రిప్ట్‌ను
టీఆర్ఎస్ చదువుతోందని, ఇక్కడ కేసీఆర్ సీమాంధ్ర ఉద్యోగస్తులు వెళ్లిపోవాలని
అంటారు, టీఆర్ఎస్ నేతలు నాలుకలు కోస్తామని రెచ్చగొడతారని, ఢిల్లీ
వెళ్లినప్పుడు మేం సంయమనం పాటిస్తున్నామని చెబుతారని, సీమాంధ్రలో
రెచ్చగొట్టి లబ్ది పొందడానికి చూస్తున్నారని బాబు విమర్శించారు.
కాంగ్రెస్ కుట్రలను రాష్ట్ర ప్రజలకు వివరించేదుకే సెప్టెంబర్ ఒకటవ తేదీ
నుంచి బస్సు యాత్ర చేస్తున్నట్లు చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎన్నో
సార్లు కలుస్తామని అపాయింట్‌మెంట్ ఇవ్వమంటే ప్రధాని ఇవ్వలేదని, అదే విజయమ్మ
అయితే రెడ్ కార్పెట్ పరిచారని ఆయన మండిపడ్డారు. జగన్‌కు బెయిల్ ఇవ్వాలి,
కేసులు మాఫీ చేయాలి, బయటకు వచ్చి రాహుల్‌ను ప్రధానిని చేయడానికి
సహకరిస్తారని, ఇదంతా కాంగ్రెస్, జగన్ ఆడుతున్న నాటకమని చంద్రబాబు
వ్యాఖ్యానించారు. రూపాయి పతనానికి అవినీతే కారణమని అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం రవీంధ్రభారతిలో చేసిన వ్యాఖ్యలు
నిర్ణయానికి ముందు ఎందుకు చెప్పలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు.
త్వరలో కొత్త పార్టీ ఆవిర్భవిస్తున్న మీడియా ప్రశ్నకు సమాధానంగా చాలా మంది
పార్టీలు పెట్టారు చివరకు ఏమయ్యాయో చూశాంకదా అన్ని అన్నారు. జగన్ మాట
తప్పను, మడమ తిప్పను అన్నారు. చివరకు సోనియా గాంధీకి సాష్టాంగ నమస్కారం
చేసే పరిస్థితిలో ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నడూ
సుస్థిర పాలన జరగలేదని, వైఎస్ హయాంలో ఐదేళ్లు అవినీతి జరిగిందని, ఒక్క
జగన్మోహన్‌రెడ్డి లక్ష కోట్లు సంపాదించారని దేశంలో ఎక్కడా జరగని అవినీతి
ఇక్కడ జరిగిందని చంద్రబాబు పేర్కొన్నారు.
టీడీపీ హయాంలో
రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని చూసి ప్రపంచమంతా పొగిడిందని చంద్రబాబు
నాయుడు అన్నారు. తెలుగు జాతి కోసం హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని,
సైబరాబాద్ సిటీని నిర్మించామని, తొమ్మిదేళ్ళ పాలనలో దేశంలో ఎక్కడా జరగని
అభివృద్ధి చేసి చూపించామని, తెలుగువారి ప్రతిష్ట కోసం ప్రపంచమంతా తిరిగామని
ఆయన అన్నారు.
రాష్టంలోని పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ
విజయంతో కాంగ్రెస్ భయపడి ఇలాంటి తొందపాటు నిర్ణయాలు తీసుకుందని చంద్రబాబు
నాయుడు విమర్శించారు. తెలుగుజాతికి సంబంధించిన వ్యవహారాన్ని కాంగ్రెస్ సొంత
వ్యవహారంలా చేసిందని ఆయన అన్నారు. తనకు రాజకీయాలు ముఖ్యం కాదని,
ఇబ్బందుల్లో ఉన్న వారి సమస్యల పరిష్కారమే ముఖ్యమని చంద్రబాబు స్పష్టం
చేశారు.
రాష్ట్ర ప్రజలను రెచ్చగొట్టి సమస్యను జఠిలం చేశారని, ఏ
రాజకీయ లబ్దికోసం సమస్యలు సృష్టించారో ప్రజలకు తెలియజేస్తానని చంద్రబాబు
నాయుడు పేర్కొన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా లక్ష కోట్లు దోచుకున్న
వ్యక్తి తన గురించి మాట్లాడే అర్హత లేదని, అడ్రస్ లేనివాళ్లు
మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. అందరికీ న్యాయం జరగాలని, న్యాయం జరిగే వరకు
కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Posted by
arjun
at
9:03 PM