March 19, 2013
బాబు కంటతడి అమ్మ ప్రస్తావనతో భావోద్వేగం
చాగల్లు మండలం చంద్రవరంలో పోలవరం కార్యకర్తల సమావేశంలో చంద్రబాబు పాల్గొన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ వయసులో పార్టీ కోసం చంద్రబాబు పడుతున్న కష్టాన్ని గురించి సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గరికపాటి మోహనరావు భావోద్వేగంతో మాట్లాడారు. "ఏదో మన కోసం బాబు పాదయాత్ర చేస్తున్నారు అనుకుంటున్నాం.
మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు నడిచి నడిచి బస్సులోకి వెళ్లిన తర్వాత..ఆయన బాధ ఏమిటనేది దగ్గరగా ఉండే మాకు తెలుసు. అది చూసి మేం రోజూ కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉన్నాం. ఆయన ఎడమకాలి చిటికెన వేలు, బొటనవేలు వాచిపోయాయి. బస్సులో కూర్చున్నచోట నుంచి లేవాలంటే 'అమ్మా..' అంటూ అల్లాడిపోతున్నారు.
ఆయన తల్లి ఎక్కడున్నారో గానీ.. ఆయన పడుతున్న కష్టాన్ని చూస్తే ఎంత బాధపడి ఉండేదో..' అని అంటుండగానే.. చంద్రబాబు కళ్లల్లో కన్నీటిచెమ్మ కదలాడింది. ముఖం గంభీరంగా మారింది. ముఖం దాచుకోవడానికి పైకి చూసే ప్రయత్నం చేసినా చెంపల మీదుగా కన్నీళ్లు కారిపోయాయి. కార్యకర్తల విషాదవదనాలు చూసిన వెంటనే.. తనను తాను కంట్రోల్ చేసుకున్నారు. 'గరికపాటి..! మీరు కొంచెం ఎక్కువ చెబుతున్నారేమో.. ముందు సమావేశం సంగతి చూడండి'' అంటూ గంభీర వాతావరణాన్ని ఆయనే చల్లబరిచారు.
Posted by
arjun
at
10:32 PM