December 8, 2012
ప్రతి రైతు కంటా కన్నీరే!

ఉపాధి హామీ పథకం వచ్చాక పొలంలో దిగే కూలీ కనిపించడం లేదు. ఎక్కడైనా ఉన్నా అంతకుఅంత ఇచ్చి తీసుకురావాల్సిన పరిస్థితి. ఒక్కోసారి నాలుగైదు కిలోమీటర్ల నుంచి ట్రాక్టర్ల మీద తరలించాల్సి వస్తోంది. ఉపాధి పథకం మంచిదే. కానీ, రైతునూ పట్టించుకోవాలి కదా? ఈ పథకాన్ని రైతుకు శత్రువుగా మార్చడం దగ్గరే ప్రభుత్వం కుట్ర ఉన్నదనిపిస్తోంది. పత్తికి కేజీకి ఆరు, ఏడు రూపాయలు ఖర్చు చేస్తున్నామని చాక్‌పల్లి రైతులు వాపోయారు. దిగుబడి మాత్రం ఎకరాకు రెండు, మూడు క్వింటాళ్లు మించడం లేదని చెబుతుంటే..పత్తి చేతిలో నిలువునా చిత్తవుతున్న రైతులు కళ్లలో మెదిలారు.
వ్యవసాయ దేశంలో ఏది పట్టినా, పట్టకున్నా రైతును విస్మరిస్తే మాత్రం అనర్ధాలు తప్పవు. ఈ విషయం గుర్తించి మార్క్‌ఫెడ్, సీసీఐలను పరుగులు తీయించాలి. కానీ, ఏ గ్రామంలోనూ అలాంటి హడావుడి కనిపించలేదు. ప్రైవేట్ వ్యాపారులు సిండికేట్లుగా తయారై మరీ దారుణమైన ధరలకు రైతుల వద్ద కొనుగోలు చేస్తున్నారు. వాళ్ల బాధలన్నీ విన్న తరువాత పత్తికి కనీసం మద్దతు ధర రూ. 5000 ఉంటే తప్ప రైతులు కోలుకునే పరిస్థితి లేదనిపించింది. నెపం ప్రకృతిపైకి నెడితే కుదరదు. ఇలాంటప్పుడు ఆదుకుంటారనే కదా ఓట్లేసి గెలిపించింది. ఆ పనీ చేయలేకపోతే ఆ పదవి ఎందుకు?
Posted by
arjun
at
9:50 PM