December 6, 2012
తెలంగానంతో కేసీఆర్‌కు ఆస్తులు: చంద్రబాబు
సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకున్న టీఆర్ఎస్ అధినేత
జైల్లోంచి జగన్ రాడు.. వీళ్లు అవిశ్వాసం పెట్టరు
రైతులను అధోగతి పాలు చేసిన కాంగ్రెస్
యూరియా కావాలంటే లాఠీదెబ్బలు తినిపిస్తున్నారు
టీఆర్ఎస్, వైసీపీ, కాంగ్రెస్‌లపై చంద్రబాబు ధ్వజం
నిజామాబాద్‌లో ముగిసిన వస్తున్నా.. మీ కోసం

ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలలో కాంగ్రెస్, టీఆర్ఎస్, వైసీపీలపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. కేసీఆర్ వల్ల తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. ఇక వైఎస్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుతిందన్నారు. వెయ్యిలారీల వంద రూపాయల నోట్ల కట్టలను వైఎస్ కుటుంబం దోచిందన్నారు. అయినా సీఎం పదవి కోసం జగన్ దేనికైనా సిద్ధపడుతున్నాడని, ఇది సిగ్గు పడాల్సిన విషయమన్నారు. కాంగ్రెస్‌తో టీడీపీ కుమ్మక్కయిందని విమర్శిస్తున్న వైసీపీ.. అసెంబ్లీలో సబ్‌ప్లాన్ విషయంలో ఎస్సీ వర్గీకరణకు మద్దతిచ్చి ప్రభుత్వాన్ని ఎందుకు పడగొట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు.
జగన్ జైలు నుంచి వచ్చాక ప్రభుత్వాన్ని పడగొడతామని వైసీపీ నేతలు చెప్పడం వారి దివాలాకోరు తనాన్ని బయటపెడుతోందన్నారు. జగన్ జైలు నుంచి రాడని, వీళ్లు అవిశ్వాసం పెట్టరని బాబు స్పష్టం చేశారు. రాష్ట్రంలో 30 ఏళ్లుగా కాంగ్రెస్‌పై రాజీలేని పోరాటం చేస్తున్నది ఒక్క టీడీపీయేనని, నిప్పులాంటి తనను తప్పుడు మనుషులు ఏమీ చేయలేరని ప్రకటించారు. తెలంగాణను అభివృద్ధి చేసింది తెలుగుదేశమేనని చెప్పారు. టీడీపీ ఎప్పుడూ పేదల పార్టీనేనని, రైతులు పుట్టెడు కష్టాల్లో ఉన్నారని, అందుకే వారి అప్పులన్నీ మాఫీ చేయాలని నిర్ణయించుకున్నామని చెప్పారు. అవినీతిని తగ్గిస్తే రుణమాఫీ పెద్ద సమస్య కాదని, వైఎస్ దోచిన సొమ్మును రికవరీ చేస్తే మూడుసార్లు రుణమాఫీ చేయొచ్చని తెలిపారు.
భర్త మోటారు దగ్గర.. భార్య స్టార్టరు దగ్గర
రాష్ట్రప్రభుత్వం రైతులను అధోగతి పాలు చేసిందని.. వ్యవసాయం చేసే రైతు మోటారు దగ్గర ఉంటే, భార్య స్టార్టరు దగ్గర ఉండాల్సిన పరిస్థితి కల్పించిందని చంద్రబాబు ఎద్దేవాచేశారు. చివరకు విద్యుత్ సమస్య వల్ల రైతులు ఆత్మహత ్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఎరువుల ధర నాలుగు రెట్లు పెంచారని, ఒక్క యూరియా బస్తా కోసం లాఠీ దెబ్బలు తినాల్సిన దుర్భర పరిస్థితి తలెత్తిందని చంద్రబాబు మండిపడ్డారు.
చివరకు విద్యావ్యవస్థనూ నాశనం చేసిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. మహిళలను పావలావడ్డీ పేరుతో మోసం చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని, ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తామని, పొగాకు రైతులకు న్యాయం చేస్తామని చెప్పారు. మైనారిటీలకు 15 అసెంబ్లీ సీట్లు ఇస్తామని, ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేస్తామని, ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తామని స్పష్టం చేశారు.
నేటి నుంచి ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్: చంద్రబాబు చేపట్టిన 'వస్తున్నా.. మీకోసం' పాదయాత్ర గురువారం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతుంది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యంచ గ్రామం మీదుగా పాదయాత్ర బుధవారం రాత్రి బాసరకు చేరుకుంది. జిల్లా టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. గురువారం నుంచి ఈనెల 13 వరకు 8 రోజుల్లో మూడు నియోజకవర్గాల మీదుగా 124 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారు. రోజూ 13-17 కిలోమీటర్ల మేర పాదయాత్ర నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. బాసర, నిర్మల్, ఖానాపూర్‌లో బహిరంగ సభల నిర్వహణకు టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.
Posted by
arjun
at
1:10 AM