December 16, 2012
జమ్మికుంటలో దీక్ష చేసి రైతును ఆదుకుంటా
పత్తి కొనకపోతే తిత్తి తీస్తా!
వారంలోగా బేళ్లన్నీ కొనుగోలు చేయాలి
లేదంటే.. దీక్ష చేసి నేలకు దించుతాం
సీఎం కిరణ్‌కు చంద్రబాబు ఘాటు హెచ్చరిక

ఓబులాపూర్ నుంచి బయలుదేరిన చంద్రబాబుకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. దారి పొడవునా వివిధ వర్గాల వారితో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారానికి హామీలిస్తూ ముందుకు సాగారు. సంగెం శ్రీరాంపూర్ దాటిన తర్వాత రోడ్డు పక్కన చెట్టు కింద కూర్చుని ఉన్న వికలాంగుల వద్దకు వెళ్లి బాగోగులు తెలుసుకున్నారు. 18 అంశాలతో వికలాంగుల పాలసీని సిద్ధం చేశామని, తెలుగుదేశం అధికారంలోకి రాగానే అమలు చేస్తామని హామీ ఇచ్చారు. అక్కడ నుంచి కొత్తదామరాజుపల్లి గ్రామానికి వచ్చి ఉమామహేశ్వరాలయంలో కుమారుడు లోకేశ్‌తో కలిసి చండీహవనంలో పాల్గొన్నారు.
అనంతరం ఓబులాపూర్, కొత్తదామరాజుపల్లి, పాత దాంరాజుపల్లి, మల్లాపూర్ గ్రామాల్లో డ్వాక్రా మహిళలను కలిశారు. పావలా వడ్డీ అని పేరుచెప్పి రెండు రూపాయలు పిండుతున్నారని కొందరు.. అసలు ఎంత వడ్డీ వేస్తున్నదీచెప్పడం లేదని మరికొందరు.. ఇచ్చే అరకొర రుణంలోనూ కోతలు పెడుతున్నారని ఇంకొందరు గోడు వెళ్లబోసుకున్నారు. " గీ మహిళ సంఘాలను నువ్వే పెట్టించినవు. గీళ్లేమో పావలా వడ్డీ అంటన్నరు.. ఐదు రూపాయలు తీసుకుంటన్నరు. మేం ఎట్ల కట్టేది, ఎట్ల బతికేది'' అని సామల కిష్ట్టమ్మ మొత్తుకోగా, "మా కోసం మీరు కేంద్రంలో కొట్లాడాలి. ఇప్పటి నుంచి మీకు మద్దతునిస్తాం. మాగురించి ఆలోచించండి'' అని కొత్తూరి నారాయణరెడ్డి అనే పసుపు రైతు వాపోయాడు.
పత్తి, పసుపు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సీఎం కిరణ్‌కు చీమ కుట్టినట్టయినా లేదని, నీరో చక్రవర్తిలా ఏసీ రూంలలో పడుకుంటున్నారని ్ఘిచంద్రబాబు విమర్శించారు. 'మార్కెట్లలో మద్దతు ధరకు పత్తిని కొనడం లేదు . వారి నుంచి వ్యాపారులు, దళారులు కొని అధిక లాభాలకు సీసీఐకి విక్రయిస్తున్నారు. వీళ్లతో కాంగ్రెస్ నేతలు కుమ్మక్కవుతున్నారు''అని దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లాలో ఆరున్నర లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగిందని, వారం రోజుల్లోగా ఆ పత్తి నిల్వలను కొనుగోలు చేయకపోతే ఈ ప్రభుత్వం అంతు తేలుస్తామని హెచ్చరించారు. గత సంవత్సరం 15 వేల రూపాయల ధర పలికిన పసుపు మూడు వేలయినా పలికేవారు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
15 వేల రూపాయల చొప్పున కొని పసుపు రైతును ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్, వైసీపీ నాయకులు దోచుకున్న డబ్బును రికవరీ చేస్తే రైతు అప్పులను ఐదేసి సార్లు మాఫీ చేయొచ్చునని చెప్పుకొచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే తొమ్మిది గంటల ఉచిత కరెంట్ ఇస్తుందని చెప్పారు. కాంగ్రెస్ అమలు చేస్తానంటున్న నగదు బదిలీ పథకం తమ పార్టీ కాపీ పథకమేనన్నారు. "కిలో బియ్యానికి బదులు ఐదు రూపాయలు బ్యాంకులో వేసి మీ పొట్టకొట్టాలని చూస్తున్నార''ని చంద్రబాబు చెప్పారు. కరీంనగర్ ఎంపీగా ఉండగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ జిల్లాకు ఏం చేశారో చెప్పాలని సవాల్ చేశారు.
జిల్లాను ఎడారి చేసే బాబ్లీ ప్రాజెక్టుపై పోరాడి తాము జైలులో ఉంటే ఒక్క టీఎంసీ నీరు మహారాష్ట్రకు ఇస్తే ఏమిటని కేసీఆర్ ప్రశ్నించారని గుర్తు చేశారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా ఉండి బీడికట్టలపై పుర్రె గుర్తును పెట్టి బీడీకార్మికుల పొట్టగొట్టారని దుయ్యబట్టారు. "వైఎస్ బయ్యారం గనుల పేరిట లక్షా 56 వేల ఎకరాలను అల్లునికి (బ్రదర్ అనిల్) దానం చేస్తే తెలుగుదేశం గట్టిగా పోరాడింది. అప్పుడు టీఆర్ఎస్ ఎక్కడ ఉంది?'' అని ఘాటుగా ప్రశ్నించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు వ్యతిరేకం కాదని, తానెప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, భవిష్యత్‌లో కూడా మాట్లాడనని చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ సమస్యపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్‌చేసింది టీడీపీయేనని గుర్తుచేశారు. కాళ్లు బొబ్బలెక్కినా, మెడ నొప్పులు వస్తున్నా పాదయాత్ర చేస్తున్నానని చెప్పుకొచ్చారు.
Posted by
arjun
at
8:28 PM