November 23, 2012
రుణ మాఫీ ఎందుకొద్దు? చంద్రబాబు
రుణ మాఫీ ఎందుకొద్దు?
తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లు కావాలనే వ్యతిరేకిస్తున్నాయి
కిరికిరి పెడుతున్న కిరణ్ ప్రభుత్వం
నాడే వ్యతిరేకించిన వైఎస్
దివాలా తీస్తామంటూ కేంద్రానికి లేఖ
జగన్ కొల్లగొట్టిన లక్షకోట్లు రికవరీ చేస్తే మాఫీ
ఎంత పని?: బాబు స్పష్టీకరణ
- సంగారెడ్డి సభలో చంద్రబాబు
సంగారెడ్డి, నవంబర్ 23 (ఆంధ్రజ్యోతి): రైతుల రుణాలను మాఫీ చేసేందుకు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ (వైసీపీ) వ్యతిరేకమని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఆయన కుమారుడు వైఎస్ జగన్ దోచుకున్న లక్ష కోట్ల రూపాయలను రికవరీ చేస్తే రైతు రుణ మాఫీ పెద్ద విషయమేమీ కాదని తెగేసి చెప్పారు. అంతేకాదు, ఆర్ఆర్ చట్టం కింద ఆ డబ్బునంతా వెలికితీస్తే, రాష్ట్రంలోని ప్రతి రైతుకూ రెండు లక్షలు చొప్పున సాయం చేయొచ్చుననీ సూచించారు.
"చంద్రబాబూ.. ఏ ప్రభుత్వాన్ని అడిగి రైతు రుణ మాఫీ చేస్తావో చెప్పు..''అని వైసీపీ నాయకురాలు విజయలక్ష్మి చేసిన సవాల్‌కు చంద్రబాబు దీటుగా ప్రతిస్పందించారు. రైతు రుణం విషయమై కాంగ్రెస్ ఫ్రభుత్వం, వైఎస్ చేసిన ద్రోహాన్ని వివరిస్తూ మెదక్ జిల్లాలో ఆరో రోజు పాదయాత్రను చంద్రబాబు కొనసాగించారు. ఆయన శుక్రవారం ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాలలో పలు సభల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా పదేపదే రైతు రుణ మాఫీ అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్‌పైనా కేంద్ర ప్రభుత్వంపైనా నిప్పులు చెరిగారు. '2009కి ముందు మేం ఉద్యమిస్తే.. రుణమాఫీ చేస్తే బ్యాంకులు దివాళా తీస్తాయని అప్పటి సీఎం వైఎస్ అడ్డుతగిలారు.
అదే విషయం ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. దానికి బదులు రైతులకు ఐదు వేల రూపాయల చొప్పున చెల్లిస్తే సరిపోతుందని సూచించారు.
అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం రైతుల రుణమాఫీపైనే ఉంటుందని చంద్రబాబు పునరుద్ఘాటించారు. కాగా, ముఖ్యమంత్రిగా రెండేళ్లు పూర్తి చేశానని సంబరాలు చేసుకుంటున్న కిరణ్ ఏం సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతీ ప్రజాసంక్షేమ పనికి ఏదో అడ్డంకి సృష్టించి కిరికిరి రెడ్డిగా మారారన్నారు. రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభానికి రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డిలే కారణమని చంద్రబాబు విమర్శించారు. కిరణ్ ప్రజల సీఎం కాదని, సీల్డ్‌కవర్ సీఎం అని విమర్శించారు. మరోవైపు స్థానిక మంత్రి గీతారెడ్డి అభివృద్ధి పనులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.
అవినీతికి పాల్పడే కాంగ్రెస్ నాయకులను చిత్తుచిత్తు చేసి శాశ్వతంగా రాజకీయాలకు దూరం చేయాలని పిలుపునిచ్చారు. చిరుధాన్యాలకు గిట్టుబాటు ధర కల్పించాలని తుల్జమ్మ కోరగా, అధికారంలోకి వస్తే గిట్టుబాటు ధర కల్పిస్తానని హామీనిచ్చారు. చిరుధాన్యాలను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి రోగాలు రావని ఆయన సూచించారు. తాము అధికారంలోకి వస్తే బీఈడీ అభ్యర్థులకు ఎస్‌జీటీతో పాటుగా నిరుద్యోగ వ్యవస్థను పూర్తిగా నిర్మూలిస్తానని హామీనిచ్చారు.
అది ఆరు పేజీల ముచ్చట
'మీపై కొన్ని పత్రికలలో వ్యతిరేక వార్తలు వెల్లువెత్తుతున్నాయ'ని యువకులు చంద్రబాబు దృష్టికి తెచ్చారు. దానిపై ఆయన తేలిగ్గా స్పందించారు. 'నాపై రాయడానికి ఒకే ఒక్క అవినీతి మీడియా సాక్షి ఉంది. నా గురించి మూడు పేజీలు రాస్తారు. వారి గురించి మూడు పేజీలు రాసుకుంటారు అంతే' అని వ్యాఖ్యానించారు. అవినీతిపై పోరాడడమే కాకుండా అవినీతి నాయకులకు బుద్ధి చెప్పాలని సూచించారు. కడపలో పార్టీ ఉపాధ్యక్షుడు శశికుమార్ వాహనాన్ని దగ్ధం చేసిన సంఘటనపై తక్షణమే విచారణ జరిపించాలని, దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
దూకుడు పెంచిన బాబు!
తెలంగాణపై ఆచితూచి మాట్లాడే చంద్రబాబు అనూహ్య దూకుడు ప్రదర్శిస్తున్నారు. 'అభివృద్ధి' చర్చ నుంచి పక్కకు పోకుండానే ఎదురుదాడిని పెంచేశారు. తెలంగాణ ఉద్యమ సారథి సొంత గడ్డపైనే ఆయననూ ఆయన పార్టీనీ చంద్రబాబు తూర్పారపడుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. మెదక్ జిల్లాలో ఆరు రోజులుగా పాదయాత్రలో ఉన్న చంద్రబాబు తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదని పదేపదే నొక్కిచెప్పారు.
భవిష్యత్తులోనూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించబోదని రెట్టించిన స్వరంతో చెప్పడం పార్టీ వర్గాలకు ఊరటనిచ్చింది. 'ఆరు నెలలు నిద్ర.. ఒక రోజు గారడీ మాటలు'గా కేసీఆర్ ఉద్యమిస్తున్నారని కూడా బాబే ఎద్దేవా చేశారు. దీన్నిబట్టి ఆ పార్టీనీ, కేసీఆర్‌నూ చంద్రబాబు లక్ష్యం చేసుకొని ముందుకు వెళుతున్నట్టు జిల్లాలోని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు ఇస్తున్న ఊపుతో ఇక తమకు తెలంగాణలో ఇబ్బందులు తొలగినట్టేనని పార్టీవర్గాలు అంటున్నాయి. మరోవైపు నడిపించే నాయకుడు నడుస్తుంటే..అనుసరించాల్సిన అనుచరులు వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
వయస్సునూ లెక్కచేయకుండా అధినేత ముందుకు దూసుకెళుతుంటే అనుయాయులు మాత్రం కార్లపై అనుసరిస్తున్నారు. మెదక్ జిల్లాలో ఆరు రోజులుగా కొనసాగుతున్న చంద్రబాబు పాదయాత్రలో కనిపిస్తున్న దృశ్యమిది. సెక్యూరిటీ భారీ స్థాయిలో ఉండడం, వారికి తోడు రోప్‌పార్టీ దూకుడు వల్ల.. చంద్రబాబుతో కలిసి పాదయాత్ర చేయడం అందరికీ సాధ్యం కావడం లేదు. ఈ కారణంగానే తామంతా ఏదో వాహనంలో వెళ్లాల్సి వస్తున్నదని స్థానిక నేతలు చెబుతున్నారు.
Subscribe to:
Post Comments
(
Atom
)
1 comment :
THE CBN IS A VISIONARY LEADER. HE CAN SERVE THE PUBLIC WITH COMMITMENT.
Post a Comment